Monday, July 1, 2019

బాలూ అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్లిన ఘంటసాల

ఇంటర్నెట్‌డెస్క్‌: తన అద్భుతమైన గానంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన గొంతు నుంచి జాలువారిన ప్రతి పాటా ఓ ఆణిముత్యమే! ఆయన పాడిన పాటలు ఎంత అద్భుతంగా ఉండేవో.. ఆయన అంత నిరాడంబరంగా ఉండేవారు. ఆయన నిరాడంబరతకు నిదర్శనం ఈ ఘటన. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఓ సందర్భంలో పంచుకున్నారిలా.

‘‘ఘంట‌సాలగారు ఆలీబాబా న‌ల‌భై దొంగ‌లు(1970) సినిమాకు సంగీతం చేస్తున్నారు. అందులో ఆయనతో పాటు నేనూ మిగిలిన వాళ్లు కలిసి ఓ పాట పాడాలి. ఆ విషయం నాకు చెప్పడానికి నా చిరునామా కోసం కోదండ‌పాణి గారింటికి వెళ్లారు. అక్కడ ఆయ‌న లేరు. కోదండపాణిగారు వ‌చ్చే వ‌ర‌కూ ఉంటాన‌ని ఇంటి ప‌క్క‌న బ‌య‌ట రేకులు ప‌రిచి ఉంటే దాని మీద చుట్ట కాలుస్తూ కూర్చొన్నారు. అదే సమయంలో నేను అక్క‌డికి వ‌చ్చి ఆయన్ను చూసి నమస్కరించా. ‘ఏమిటి మాస్టారూ.. ఇక్క‌డ కూర్చొన్నారు’ అని అడిగా ఆశ్చ‌ర్య‌పోతూ.. ‘‘ఏం లేదు బాబూ నీ అడ్ర‌సు కనుక్కొందామని కోదండ‌పాణి ఇంటికొచ్చాను. ఆయన లేరు. ఇప్పుడే వ‌స్తారని చెప్పారు. సర్లే అని ఇక్కడ కూర్చున్నా. నేను ‘ఆలీబాబా’కు సంగీతం చేస్తున్నా. నువ్వు నేనూ క‌లిసి ఓ పాట పాడాలి. వీలైన‌ప్పుడు రిహార్స‌ల్స్‌కు రా’’ అని అన్నారు. ‘అది చెప్పడానికి మీరే స్వయంగా రావాలా మాస్టారూ..! ప్రొడక్షన్‌ వాళ్లతో క‌బురు చేయొచ్చు క‌దా’ అని నేను అంటే.. ‘లేదు బాలూ వేరే ప‌ని మీద ఇటు ప‌క్క వ‌చ్చాను. ఎలాగూ వచ్చానని నీ అడ్రసు అడుగుదామని కోదండ‌పాణి ఇంటికి వ‌చ్చాను’ అని ఘంటసాల అంటే చెమర్చిన కళ్లతో ఆయన నమస్కారం చేశాను’ అని చెప్పుకొచ్చారు బాలు.

Courtesy: https://www.eenadu.net/cinema/morenews/8/2019/06/23/115989/ghantasala-went-to-sp-balasubrahmanyam-home



No comments:

Post a Comment